Bombay Karachi Halwa Recipe : స్వీట్ షాపుల్లోనే ల‌భించే బాంబే క‌రాచీ హ‌ల్వా.. ఇంట్లోనూ ఇలా చేయ‌వ‌చ్చు..

Bombay Karachi Halwa Recipe : బొంబే హ‌ల్వా.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ హ‌ల్వాను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. బ‌య‌ట స్వీట్ షాపుల్లో ఎక్కువ‌గా ఈ హ‌ల్వా త‌యార‌వుతుంది. ఈ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌డం చాలా స‌లుభం. కొద్దిగా ఓపిక ఉండాలే కానీ దీనిని మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. బొంబే హ‌ల్వాను చ‌క్క‌గా, రుచిగా ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బొంబే క‌రాచీ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కార్న్ ఫ్లోర్ – పావు కిలో, నీళ్లు – 700 ఎమ్ ఎల్, నిమ్మ ఉప్పు – ఒక టీ స్పూన్, పంచ‌దార – కేజీ, నెయ్యి – పావు కిలో, జీడిపప్పు ప‌లుకులు – అర‌ క‌ప్పు, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – అర టీ స్పూన్.

Bombay Karachi Halwa Recipe in telugu how to make it
Bombay Karachi Halwa Recipe

బొంబే క‌రాచీ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. త‌రువాత అందులో 350 ఎమ్ ఎల్ నీటిని పోసి ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో నిమ్మ ఉప్పును వేసి కొద్దిగా నీటిని పోసి ఉప్పు క‌రిగే వ‌ర‌కు క‌లుపుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత లోతుగా అడుగ భాగం మందంగా ఉండే ఒక క‌ళాయిని తీసుకుని అందులో పంచ‌దార‌, 700 ఎమ్ ఎల్ నీటిని పోసి వేడి చేయాలి. పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత పంచ‌దార మిశ్ర‌మం నుండి స‌గం మిశ్ర‌మాన్ని మ‌రో గిన్నెలోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఉన్న పంచ‌దార మిశ్ర‌మంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి క‌లపాలి. త‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ను క‌లుపుతూ వేసుకోవాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై చిక్క‌బ‌డే వ‌ర‌కు 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.

ఇలా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత దీనిని మ‌రో 10 – 15 నిమిషాల పాటు బాగా క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత ఒక పెద్ద గంటెను తీసుకుని దానితో ప‌క్క‌కు పెట్టుకున్న పంచ‌దార పాకంతో పాటు 2 టేబుల్ స్పూన్ల‌నెయ్యిని వేస్తూ క‌ల‌పాలి. ఇలా పాకాన్ని, నెయ్యిని ప్ర‌తి 5 నిమిషాలకొక‌సారి పోస్తూ క‌లుపుతూ ఉండాలి. ఇలా రెండు సార్లు వేసిన త‌రువాత వీటితో పాటు కొద్ది కొద్దిగా నిమ్మ ఉప్పు నీటిని కూడా వేస్తూ క‌లుపుతూ ఉండాలి. నిమ్మ ఉప్పు వేసిన త‌రువాత మంట‌ను కొద్దిగా పెద్ద‌గా చేయాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కార్న్ ఫ్లోర్ నెయ్యిని పీల్చుకుని బాగా వేగి బుడ‌గ‌లు బుడ‌గ‌లుగా వ‌స్తుంది. త‌రువాత ఇందులో పావు క‌ప్పు జీడిప‌ప్పు ప‌లుకులు వేసి క‌లిపి మ‌రో 10 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని కొద్దిగా తీసుకుని ఉండ‌గా చేసి చూడాలి. ఉండ‌గా చేయ‌డానికి వ‌స్తే హ‌ల్వా త‌యార‌య్యిందిగా భావించాలి.

ఒకవేళ ఉండ‌గా చేయ‌డానికి రాక‌పోతే దీనిని మ‌రికొద్ది సేపు ఉడికించాలి. కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మం ఉండ‌గా వ‌చ్చిన తరువాత ఇందులో ఫుడ్ క‌ల‌ర్ వేసి 3 నుండి 4 నిమిషాల పాటు పెద్ద మంట‌పై క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత వాటిపై మ‌రో పావు క‌ప్పు జీడిపప్పు ప‌లుకుల‌ను చ‌ల్లి 4 గంట‌ల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. హ‌ల్వా గ‌ట్టి ప‌డిన త‌రువాత దానిని ముందుగా అంచుల నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకుని కావ‌ల్సిన ఆకారంలో ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇలా చేయ‌టి వ‌ల్ల చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే బొంబే హ‌ల్వా త‌యార‌వుతుంది. పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే బొంబే హ‌ల్వా త‌యార‌వుతుంది. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఇలా హ‌ల్వాను ఇంట్లోనే త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ హ‌ల్వాను వ‌ద్ద‌న్న‌కుండా అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts