Borugula Muddalu : మనం ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ మరమరాలను కూడా తీసుకుంటూ ఉంటాం. ఇవి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరమరాలలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. మరమరాలతో కూడా మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మరమరాలతో చేసే తీపి పదార్థాలలో బొరుగుల ముద్దలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తినే ఉంటారు. బొరుగుల ముద్దలను తయారు చేయడం చాలా సులభమే. ఎంతో రుచిగా ఉండే ఈ బొరుగుల ముద్దలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బొరుగు ముద్దల తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – పావు కిలో, బెల్లం తురుము – పావు కిలో, నీళ్లు – ఒక కప్పు.
బొరుగు ముద్దల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో లేదా గిన్నెలో బెల్లాన్ని, నీళ్లను పోసి బెల్లం కలిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత ఆ నీటిని వడపోసి మళ్లీ అదే కళాయిలో లేదా గిన్నెలో పోసి పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఒక ప్లేట్ లో నీళ్లను పోసి అందులో ఉడికించిన బెల్లం మిశ్రమాన్ని వేసి ముద్దగా చుట్టాలి. బెల్లం మిశ్రమం ముద్దగా చుట్టడానికి వస్తే పాకం వచ్చినదిగా భావించాలి. బెల్లం మిశ్రమం ముద్దగా చుట్టడానికి రాకపోతే మరి కొద్ది సేపు ఉడికించి పాకం వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇందులోనే మరమరాలను పోసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత ఒక ప్లేట్ కి నూనె లేదా నెయ్యిని రాసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకుని చేతులకు తడి చేసుకుంటూ బెల్లం, మరమరాల మిశ్రమాన్ని కావల్సిన పరిమాణంలో తీసుకుని ముద్దలుగా చేసి నెయ్యి రాసి ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొరుగు ముద్దలు తయారవుతాయి. ఈ బొరుగు ముద్దలు స్నాక్స్ గా తినడానికి చాలా బాగుంటాయి. వీటిని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.