Bread Milk Toast : బ్రెడ్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బ్రెడ్ తో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో బ్రెడ్ మిల్క్ టోస్ట్ కూడా ఒకటి. పాలతో చేసే ఈ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. తియ్యగా ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ మిల్క్ టోస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ మిల్క్ టోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – ఒక టేబుల్ స్పూన్, బ్రెడ్ స్లైసెస్ – 2, పాలు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ – ఒక టీ స్పూన్.
బ్రెడ్ మిల్క్ టోస్ట్ తయారీ విధానం..
ముందుగా బటర్ వేసి బ్రెడ్ స్లైసెస్ ను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత పాలల్లో పంచదార వేసి కలపాలి. తరువాత కళాయిలో పంచదార కలపిన పాలు పోసి వేడి చేయాలి. పాలు మరిగిన తరువాత బ్రెడ్ స్లైసెస్ ను ఒక దాని మీద ఒకటి ఉంచి పాలల్లో వేయాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ ను నెమ్మదిగా అటూ ఇటూ తిప్పుతూ పాలన్నీ పీల్చుకునే వరకు ఉంచాలి. కళాయిలో పాలన్నీ అయిపోయి బ్రెడ్ మెత్తబడిన తరువాత బ్రెడ్ స్లైసెస్ ను నెమ్మదిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిపై డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ మిల్క్ టోస్ట్ తయారవుతుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తినవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు.