Bread Murukulu : మనం వంటింట్లో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో మురుకులు ఒకటి. వీటిని తయారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. ఈ మురుకులను మనం బ్రెడ్ తో కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే మురుకులు చాలా రుచిగా ఉంటాయి. బ్రెడ్ తో మురుకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ మురుకులు తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసులు – 12, శనగపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నువ్వులు – 4 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ మురుకులు తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసుల్ని తీసుకుని వాటి అంచులను తీసివేయాలి. తరువాత వీటిని ఒక అర నిమిషం పాటు నీటిలో నానబెట్టి బయటకు తీసి నీటిని పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె కాగిన తరువాత పిండిని మురుకుల గొట్టంలో వేసి కాగుతున్న నూనెలో మురుకులా వత్తుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే బ్రెడ్ మురుకులు తయారవుతాయి. గాలి తగలకుండా వీటిని నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే బ్రెడ్ మురుకులను చేసుకుని తినవచ్చు.