Bread Pakoda : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో బ్రెడ్ పకోడా కూడా ఒకటి. బ్రెడ్ పకోడా చాలా రుచిగాఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ బ్రెడ్ పకోడాలను స్ట్రీట్ స్టైల్ లో మనం కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. వేడి వేడిగా తినాలనిపించినప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రెడ్ పకోడాలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో కమ్మగా, క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ పకోడాలను స్ట్రీట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్టైసెస్ – 5, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, టమాట కిచప్ – అర కప్పు.
బెటర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, కసూరిమెంతి -ఒక టీ స్పూన్, నీళ్లు – ముప్పావు కప్పు.
గ్రీన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – అర కప్పు, పచ్చిమిర్చి – 1, అల్లం – పావు ఇంచు ముక్క, నిమ్మరసం – అర చెక్క. ఉప్పు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.
ఆలూ మిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1,అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఆమ్ చూర్ – అర టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – చిన్నవి 2.
బ్రెడ్ పకోడా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని కలుపుకోవాలి. తరువాత 2 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గ్రీన్ చట్నీ కోసం కొత్తిమీరను జార్ లో వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఆలూ మిక్స్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉ్లిపాయ ముక్కలు వేసివేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత బంగాళాదుంప ముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని ముందుగా క్రాస్ గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత వీటిని మరింత చిన్నగా వచ్చేలా మరోసారి క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న రెండు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని ఒక దానికి టమాట కిచప్ ను, మరో దానికి గ్రీన్ చట్నీని రాసుకోవాలి. తరువాత ఒక బ్రెడ్ స్లైస్ పై బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి దానిపై మరో స్లైస్ ను ఉంచి సిద్దం చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఈ బ్రెడ్ ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పకోడాలు తయారవుతాయి. వీటిని టమాట సా్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూఎంతో ఇష్టంగా తింటారు.