Bun Dosa : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశలు కూడా ఒకటి. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన దోశలల్లో బన్ దోశ కూడా ఒకటి. ఈ దోశ మెత్తగా, పుల్ల పుల్లగా, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ దోశను తింటే మరలా ఇదే కావాలంటారు. అందరికి ఎంతగానో నచ్చే ఈ బన్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, అటుకులు – అర కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, పుల్లటి మజ్జిగ – రెండు లీటర్లు, ఉప్పు – తగినంత, బెల్లం – నిమ్మకాయంత.
బన్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, అటుకులు, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత మజ్జిగ వేసి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసి బెల్లం, ఉప్పు వేసి నానబెట్టిన మజ్జిగతోనే మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత మరోసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి .తరువాత గంటె పిండిని తీసుకుని పెనం మీద వేసుకోవాలి. దీనిని దోశ లాగా రుద్దకూడదు. ఎలా వేసిన పిండిని అలాగే ఉంచాలి. తరువాత పైన మరియు అంచుల చుట్టూ నూనె వేసి మూత పెట్టి చిన్న మంటపై 2 నిమిషాల పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే ఈదోశను మరో వైపుకు తిప్పి కాల్చుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే బన్ దోశ తయారవుతుంది. దీనిని అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బన్ దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.