Cabbage Pachadi : క్యాబేజితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాబేజి పచ్చడి కూడా ఒకటి. క్యాబేజి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజితో చేసే కూరల కంటే ఈ పచ్చడే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.ఎంతో రుచిగా, లొట్టలేసుకుంటూ తినాలనిపించే ఈ క్యాబేజి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి తురుము – ఒక పెద్ద కప్పు, పసుపు – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, చింతపండు – ఒక రెమ్మ, నూనె – ఒక టేబుల్ స్పూన్.
క్యాబేజి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత క్యాబేజి తురుము, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ క్యాబేజిని పూర్తిగా వేయించాలి. క్యాబేజి చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు,చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని ఇలాగే నేరుగా తినవచ్చు. లేదంటే తాళింపు వేసి కూడా తినవచ్చు. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన క్యాబేజి పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.