Carrot Halwa : క్యారెట్స్.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. క్యారెట్ ను నేరుగా తినడం, జ్యూస్ గా చేసుకుని తాగడం, వివిద రకాల వంటకాల్లో వాడడం, క్యారెట్ పచ్చడిని తయారు చేయడం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా క్యారెట్ లతో హల్వాను కూడా తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ హల్వా ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. రుచికరంగా, చాలా త్వరగా అయ్యేలా క్యారెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ – అర కిలో, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, బాదం పలుకులు – 15, చిక్కటి పాలు – అర లీటర్, యాలకుల పొడి – అర టీ స్పూన్, పంచదార – అర కప్పు లేదా తగినంత, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
క్యారెట్ హల్వా తయారీ విధానం..
ముందుగా క్యారెట్ లను తీసుకుని వాటి చివర్లను, అలాగే వాటిపై ఉండే చెక్కును తీసేసి శుభ్రపరుచుకోవాలి. తరువాత ఈ క్యారెట్ లను తురుముకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో బాదం పప్పును వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత అందులో 3 టేబుల్ స్పూన్ల పాలు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక క్యారెట్ తురుమును వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. క్యారెట్ ఉడికిన తరువాత అందులో ముందుగా తయారు చేసుకున్న బాదం పప్పును పేస్ట్ ను వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత పాలు పోసి కలిపి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. క్యారెట్ హల్వా దగ్గరగా, మెత్తగా అయిన తరువాత అందులో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత పంచదార వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను చల్లి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా క్యారెట్ లతో ఎంతో రుచికరమైన హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. క్యారెట్ లతో చేసిన ఈ హల్వా అందరికి నచ్చుతుంది.