Carrot Laddu : క్యారెట్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటాం. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. క్యారెట్ తో వివిధ రకాల వంటలు, తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో తీపి వంటకాలు అనగానే చాలా మంది క్యారెట్ హల్వానే గుర్తుకు వస్తుంది. హల్వానే కాకుండా క్యారెట్ తో లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తో చేసే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యారెట్ తో రుచిగా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ తురుము – 500 గ్రా., పచ్చి కొబ్బరి తురుము – 100 గ్రా., పంచదార – 200 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు.
క్యారెట్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేడి చేయాలి. ఇవి వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో క్యారెట్ తురుము వేసి వేయించాలి. క్యారెట్ పచ్చి వాసన పోయి బాగా వేగిన తరువాత పచ్చి కొబ్బరి పొడి కూడా వేయించాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత పంచదారను వేసి కలపాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత ఫుడ్ కలర్ వేసి కలపాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు దగ్గర పడే వరకు బాగా వేయించాలి. తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ మిశ్రమం కొద్దిగా గోరు వెచ్చగా అయిన తరువాత దీనిని తగిన పరిమాణంలో తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ లడ్డూ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా క్యారెట్ తో చాలా సులువుగా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. క్యారెట్ తో ఇలా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు పోషకాలను కూడా పొందవచ్చు. ఈ విధంగా క్యారెట్ తో లడ్డూలను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. క్యారెట్ తినని పిల్లలకు ఈ విధంగా లడ్డూలను చేసి పెట్టడం వల్ల క్యారెట్ లోని పోషకాలను అందుతాయి.