Carrot Saggubiyyam Payasam : మనం వంటింట్లో విరివిరిగా సగ్గు బియ్యం పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా మనం పాయసాన్ని పంచదార, బెల్లం ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాం. బెల్లం, పంచదార ఉపయోగించకుండా కూడా మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యానికి మరింత మేలు చేసేలా ఈ పాయసంలో మనం క్యారెట్ ను కూడా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పంచదార, బెల్లం ఉపయోగించకుండా అలాగే మన ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
సగ్గు బియ్యం – అర కప్పు, క్యారెట్ – పావు కిలో, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, చిక్కటి పాలు – ఒక లీటర్, కుంకుమ పువ్వు – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, తేనె – ముప్పావు కప్పు.
క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి సగ్గుబియ్యాన్ని గంట పాటు నానబెట్టాలి. తరువాత క్యారెట్ పై ఉండే చెక్కును తీసేసి వాటిని పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ తో తురుముకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత మిగిలిన నెయ్యిలో క్యారెట్ తురుము వేసి 4 నుండి 5 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసి ఉడికించాలి. సగ్గుబియ్యాన్ని కలుపుతూ 60 శాతం ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పాలు పోసి కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. పాలు మరిగిన తరువాత క్యారెట్ తురుము వేసి కలపాలి. దీనిని కలుపుతూ 20 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పాయసాన్ని చల్లారనివ్వాలి. పాయసం చల్లారిన తరువాత ఇందులో తేనెను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లారిన తరువాత కూడా తినవచ్చు. ఈ విధంగా క్యారెట్ సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ పాయసాన్ని ఎంత కావాల్సి వస్తే అంతా తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.