Cashew Pakoda : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. జీడిపప్పును తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, దంతాలను దృఢంగా ఉంచడంలో జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.
తరచూ జీడిపప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఈ జీడిపప్పును చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. కొందరు వంటల తయారీలో ఉపయోగిస్తారు. ఈ విధంగానే కాకుండా వీటితో ఎంతో రుచిగా కూడా పకోడీలను కూడా తయారు చేస్తూ ఉంటారు. జీడిపప్పు పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఎంతో రుచిగా ఉండే ఈ జీడిపప్పు పకోడీలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు పకోడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడి పప్పు – ఒక కప్పు, శనగ పిండి – పావు కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెబ్బలు, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీస్పూన్, నీళ్లు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
జీడిపప్పు పకోడీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పును తీసుకుని అందులో నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా నీటిని పోసి మామూలు పకోడీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత జీడి పప్పు మిశ్రమాన్ని పకోడీలలా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే జీడిపప్పు పకోడీ తయారవుతుంది. అప్పుడప్పుడూ ఇలా జీడిపప్పుతో పకోడీలని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు జీడిపప్పును తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.