Chaat Chutney : మనలో చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్ లో పానీ పూరీ, చాట్ కూడా ఒకటి. వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో చాట్ బండార్ లలో, బండ్ల మీద ఇవి విరివిరిగా లభిస్తాయి. అలాగే మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే ఈ పానీ పూరీలను, చాట్ ను అలాగే ఇతరత్రా చిరుతిళ్లను మనకు గ్రీన్ కలర్ లో ఉండే చాట్ చట్నీతో సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ చట్నీతో తింటేనే మనం తినే చిరుతిళ్లు మరింత రుచిగా ఉంటాయి. ఈ చాట్ చట్నీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. చాట్ చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాట్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – ఒక కప్పు, కొత్తిమీర ఆకులు – ఒక కప్పు, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – తగినంత, పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, నీళ్లు – 2 లేదా 3 టీ స్పూన్స్.
చాట్ చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక పుదీనా ఆకులను, కొత్తిమీరను తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నింటిని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చాట్ చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. అలాగే ఈ చట్నీతో మనం వెజ్ సాండ్ విచ్ లను కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ చట్నీని తయారు చేసి పెట్టుకోవడం వల్ల సాయంత్రం సమయాల్లో స్నాక్స్ ను మరింత సులభంగా తయారు చేసుకోవచ్చు.