Chalimidi Pakam : మనం అనేక తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే మనకు కొన్ని సాంప్రదాయ తీపి వంటకాలు కూడా ఉంటాయి. అలాంటి వంటకాల్లో చలిమిడి కూడా ఒకటి. చలిమిడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ప్రతి శుభకార్యానికి కూడా చలిమిడిని తయారు చేస్తూ ఉంటాం. దీనిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. చక్కగా, రుచిగా ఈ చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చలిమిడి తయారీకి కావల్సిన పదార్థాలు..
రేషన్ బియ్యం – ఒకటిన్నర గ్లాస్, నెయ్యి – 3 టీ స్పూన్స్, పచ్చికొబ్బరి ముక్కలు – ఒక కప్పు, గసగసాలు – రెండున్నర టీ స్పూన్స్, పంచదార – ముప్పావు గ్లాస్, యాలకులు – 4.
చలిమిడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఒక రోజంతా నానబెట్టాలి. ఈ బియ్యాన్ని పూట పూటకు కడుగుతూ ఉండాలి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒక జల్లి గిన్నెలోకి తీసుకుని నీళ్లన్ని పోయేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక కొబ్బరి ముక్కలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గసగసాలను వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించి తడి ఆరిపోకుండా దానిపై మూతను ఉంచి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకుని దానిలో పంచదార, యాలకులు, కొద్దిగా నీటిని పోసి వేడి చేయాలి.
పంచదార కరిగి ముదురు తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. పంచదార మిశ్రమాన్ని తీసుకుని నీటిలో వేసి చూస్తే ముద్దగా అవ్వాలి. ఇలా తయారయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అందులో వేయించిన సగం ఎండుకొబ్బరి ముక్కలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ చలిమిడి చల్లగా ఉన్నప్పుడు పలుచగా ఉన్నా చల్లారే కొద్ది గట్టిగా అవుతుంది. ఇలా తయారు చేసుకున్న చలిమిడిని ఒక గిన్నెలోకి తీసుకుని దానిపై మిగిలిన కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చలిమిడి తయారవుతుంది. ఇలా తయారు చేసిన చలిమిడి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ చలిమడిలో కొద్దిగా నీళ్లు వంటసోడా పోసి అట్లలాగా కూడా తయారు చేసుకోవచ్చు.