Chalimidi : చలిమిడి.. ఇది తెలియని వారు.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం తయారు చేసే సాంప్రదాయ వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ చలిమిడిని ఇష్టపడని వారు ఉండనే ఉండరు. ఎక్కువగా దీనిని పండగలకు తయారుచేస్తూ ఉంటారు. అలాగే దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కో రుచితో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చలిమిడి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా ఈ చలిమిడిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చలిమిడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – 250 గ్రా., పంచదార – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్, తడి బియ్యం పిండి – 350 గ్రా. నుండి 400 గ్రా., జీడిపప్పు – పిడికెడు, ఎండు కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
చలిమిడి తయారీ విధానం..
ముందుగా మందంగా ఉండే కళాయిలో బెల్లం తురుము, పంచదారను వేసుకోవాలి. తరువాత ఇవి మునిగే వరకు నీటిని పోసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగి పొంగు వచ్చేటప్పుడు నెయ్యి వేసి కలపాలి. బెల్లం మిశ్రమం ముద్దగా అయ్యే వరకు ఉడికించాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే అది ఉండ కట్టాలి. ఇలా బెల్లం మిశ్రమం తయారవ్వగానే కొద్ది కొద్దిగా తడి బియ్యం పిండిని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం ముద్దగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గసగసాలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ ను, యాలకుల పొడిని చలిమిడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చలిమిడి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చలిమిడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.