Champaran Fish Curry : చంపారన్ చేపల కూర.. చంపారన్ స్టైల్ లో చేసే ఈ చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చింతపులుసు వేసి చేసే చేపల కూర కంటే ఈ విధంగా చేసిన చేపల కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే చేపల కూరలో ముక్కలు మెత్తబడి విరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. చేపలను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వివిధ రుచులను కోరుకునే వారు ఈ కూరను తప్పక రుచి చూడాల్సిందే. మరింత రుచిగా కమ్మగా ఉండే ఈ చంపారన్ చేపల కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చంపారన్ చేపల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఆవాల నూనె – 3టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి పాయలు – 3, నీళ్లు – తగినన్ని, పచ్చిమిర్చి – 6.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 3, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉడికించిన టమాటాలు – 3.
చంపారన్ చేపల కూర తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత మసాలా కోసం కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు వేసి వేయించాలి. ఇవన్నీ దోరగా వేగిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తరువాత ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో టమాట ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత ఒక మట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత శుభ్రమైన వెల్లుల్లి పాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత టమాట పేస్ట్, ఉప్పు, కారం వేసి కలపాలి. వీటిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత తగిన్ని పోసి కలపాలి. తరువాత మూత పెట్టి ఉడికించాలి. పులుసు మరిగిన తరువాత వేయించిన చేప ముక్కలు వేసి కలపాలి. తరువాత గాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసి మూత పెట్టి చిన్న మంటపై 15నిమిషాల పాటు ఉడికించాలి. పులుసు చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చంపారన్ చేపల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చేపల కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.