Chekka Appadalu : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో చెక్క అప్పడాలు ఒకటి. వీటినే చెక్కలు, చెక్క గారెలు అని కూడా అంటారు. చెక్క అప్పడాలు ఎంత రుచిగా ఉంటాయో మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పండులకు ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉంటాం. అయితే కొందరు ఎంత ప్రయత్నించిన వీటిని గుల్లగుల్లగా తయారు చేసుకోలేకపోతుంటారు. చెక్క అప్పడాలను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెక్క అప్పడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడి బియ్యం పిండి – రెండున్నర గ్లాసులు, నీళ్లు – రెండుంపావు గ్లాసులు, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్ లేదా తగినంత, జీలకర్ర – రెండు టీ స్పూన్స్, తరిగిన కరివేపాకు – గుప్పెడు, నానబెట్టిన శనగపప్పు – రెండు గుప్పెలు.
చెక్క అప్పడాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉప్పు, కారం, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత పిండిని వేసి కొద్దిగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారే వరకు ఉంచాలి. పిండి చల్లారిన తరువాత చేత్తో చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. తరువాత తగినంత పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూతను ఉంచాలి. తరువాత చేతికి నూనె రాసుకుంటూ తగినంత పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పాలిథిన్ కవర్ పై నూనె రాసి పిండి ఉండను ఉంచి చేత్తో అప్పడాల వత్తుకోవాలి. చేత్తో వత్తుకోవడం రాని వారు పూరీ ప్రెస్ తో కూడా ఈ చెక్క అప్పడాలను వత్తుకోవచ్చు.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న చెక్క అప్పడాలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, గుల్లగుల్లగా ఉండే చెక్క అప్పడాలు తయారవుతాయి. కేవలం పండగలకే కాకుండా అప్పుడప్పుడూ ఇలా చెక్క అప్పడాలను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే చెక్క అప్పడాలను తయారు చేసుకుని చక్కగా తినవచ్చు.