Chemagadda Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చామగ్డలు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చామగడ్డలతో వేపుడు, కూర, పులుసు వంటి రకరకాల వంటకాలను తయారు చేసుకుని తినవచ్చు. చామగడ్డలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కరకరలాడేలా, రుచిగా ఈ వేపుడును తయారు చేసుకోవచ్చు. చామదుంపలను తినడానికి ఇష్టపడని వారు కూడా కింద చెప్పిన విధంగా చేసే ఈ వేపుడును ఇష్టంగా తింటారు. కరకరలాడేలా చామగడ్డ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చామగడ్డ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చామగడ్డలు – పావు కిలో, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తాళింపుకు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, సాంబార్ కారం – ఒక టేబుల్ స్పూన్.
చామగడ్డ వేపుడు తయారీ విధానం..
ముందుగా చామగడ్డలను కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వాటిపై పొట్టును తీసి అర ఇంచు ముక్కలుగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత మరో టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టీ స్పూన్ల నూనె వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక చామగడ్డ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత ఇందులో ముందుగా వేయించుకున్న చామగడ్డ ముక్కలను వేసి కలపాలి. తరువాత సాంబార్ కారం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామగడ్డ వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చామగడ్డ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన చామగడ్డ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.