Chettinad Masala Aloo Fry : మనం బేబి పొటాటోస్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఆలూ ఫ్రై కూడా ఒకటి. బేబి పొటాటోస్ తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పొటాటో ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. చెట్టినాడు మసాలా వేసి చేసే ఈ ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబి పొటాటోస్ – అరకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
మసాలా పొడి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, కాశ్మీని ఎండుమిర్చి – 2, ఎండుమిర్చి – 4, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, అనాసపువ్వు – 1, లవంగాలు – 2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్.
చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత బేబి పొటాటోస్ ను తీసుకుని దానిపై ఉండే చెక్కును తీసివేయాలి. తరువాత వాటికి ఫోర్క్ తో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత బేబి పొటాటోస్ వేసి వేయించాలి.
వీటిని పెద్ద మంటపై 5 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. బేబి పొటాటోస్ పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, పసుపు వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చెట్టినాడు మసాలా ఆలూ ఫ్రై తయారవుతుంది. బేబి పొటాటోస్ తో ఎప్పుడూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా ఫ్రైను కూడా తయారు చేసుకుని తినవచ్చు.