Kalipattu : మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే మనకు బయట కూడా దోశలు విరివిగా లభిస్తూ ఉంటాయి. మనకు బయట ఎక్కువగా లభించే వెరైటీ దోశలల్లో కలిపట్టు కూడా ఒకటి. కలిపట్టును తింటే మనం రెండు రకాల దోశలను ఒకేసారి తిన్న అనుభూతి పొందవచ్చు. కలిపట్టు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. కలిపట్టును తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే కలిపట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలిపట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ బియ్యం – ఒక కప్పు, మినపప్పు – పావు కప్పు, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, లావు అటుకులు – పావు కప్పు, పెసర్లు – అర కప్పు, దోశ బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, పంచదార – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తురుము – ఒక టీ స్పూన్.
కలిపట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో దోశ బియ్యం, మినపప్పు, శనగపప్పు, మెంతులు, అటుకులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో పెసర్లు, దోశ బియ్యం, శనగపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ పెసర్లను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత ముందుగా పులియబెట్టుకున్న పిండిలో ఉప్పు, పంచదార వేసి కలిపి పక్కకు ఉంచాలి.
తరువాత మరో గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తురుము వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు పెనాని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి తుడుచుకోవాలి. ఇప్పుడు ముందుగా మినపప్పుతో చేసిన పిండిని గంటెతో వేసుకోవాలి. తరువాత ఈ పిండిపై కొద్దిగా పెసర్లతో చేసిన పిండిని వేసి దోశలాగా పలుచగా రుద్దుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత ఉల్లిపాయ మిశ్రమం వేసుకోవాలి. తరువాత నూనె వేసి దోశ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలిపట్టు తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కలిపట్టును కూడా తయారు చేసుకుని తినవచ్చు.