Chicken Roast : తక్కువ ధరలో శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ ను అందించే ఆహారాల్లో చికెన్ ఒకటి. మనం చికెన్ ను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఎటువంటి వంట అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇక చికెన్ తో చేసే వంటలలో చికెన్ రోస్ట్ కూడా ఒకటి. చికెన్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని కాస్త శ్రమిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – 300 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కారం పొడి – 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 5 టేబుల్ స్పూన్స్.
చికెన్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసుకోవాలి. తరువాత నూనె తప్ప పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి కలిపి మూతపెట్టి గంటపాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఒక కళాయిలో మిగిలిన నూనెను వేసి కాగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ను వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మూత తీసి చికెన్ ను కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్ పూర్తిగా వేగిన తరువాత తరిగిన కొత్తిమీరను మరి కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ రోస్ట్ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో అంచుకు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.