Chickpeas Fry : మనం ఆహారంగా తీసుకునే పప్పు ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని మనకు తెలిసిందే. మాంసాహారం తినని వారు శనగలను తినడం వల్ల శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్లను పొందవచ్చు. వీటిని తినడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. బరువు కూడా తగ్గవచ్చు. శరీరానికి కావల్సినన్ని పోషకాలను పొందవచ్చు. శరీరం బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ శనగలతో చేసుకోదగిన వాటిల్లో గుగ్గిళ్లు ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ శనగలను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. శనగలతో గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగ గిగ్గుళ్లు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – 200 గ్రా., శనగపప్పు – అరటీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
శనగ గిగ్గుళ్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 7 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో నానబెట్టుకున్న శనగలను, ఉప్పును వేసి కలపాలి. ఈ శనగలను మెత్తగా అయ్యే వరకు 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ శనగలను మనం కుక్కర్ లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికించిన శనగలను వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉడికించిన శనగలను వేసి అంతాకలిసేలా బాగా కలపాలి. చివరగా కొత్తిమీరను చల్లుకోవాలి. ఇల చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగ గిగ్గులు తయారవుతాయి. వీటిని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా శనగ గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.