Chinthakaya Pappu : చింతకాయలు.. ఇవి మనందరికి తెలిసినవే. చింతకాయలు సంవత్సరమంతా దొరికినప్పటికి అవి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చింతకాయలను తీసుకోవడం వల్ల మనం రకరకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో, శ్వాస సంబంధిత సమస్యలను తొలగించడంలో, గాయాలు త్వరగా మానేలా చేయడంలో ఈ చింతకాయలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ చింతకాయలతో మనం రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా చింతకాయలతో పప్పును ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 200 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 4, పసుపు – అర టీ స్పూన్, చింతకాయలు – పావు కిలో, నీళ్లు – తగినన్ని, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – రెండు చిటికెలు.
చింతకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు, పసుపు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. ఈ పప్పును మధ్యస్థ మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి చల్లారిన తరువాత చింతకాయల నుండి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు పప్పును మెత్తగా చేసుకుని అందులో ఉప్పు, కారం, తగినంత చింత పండు గుజ్జు, రుచికి తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని తాళింపు చేసుకోవాలి.
ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పప్పులో వేసి కలపాలి. తరువాత ఈ పప్పును మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతకాయ పప్పు తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చింతకాయలు దొరికినప్పుడు ఇలా పప్పును తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చింతకాయలు దొరికినప్పుడు ఇలా పప్పును, పచ్చళ్లను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.