Coriander Tomato Rice : మనం వంటలను గార్నిష్ చేయడానికి గానూ ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో కొత్తిమార ఒకటి. కొత్తిమీరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తిమీరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు అనేకం ఉంటాయి. వంటల్లో వాడడంతో పాటు కొత్తిమీరతో మనం కొత్తిమీర రైస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. కొత్తిమీర రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా చేసుకునేంత సులభంగా ఈ కొత్తిమీర రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – 5 కట్టలు ( చిన్నవి), బాస్మతీ బియ్యం – ఒకటిన్న గ్లాస్, నీళ్లు – రెండుప్పావు గ్లాసులు, ఉప్పు – తగినంత, నూనె – 5 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 4, తరిగిన టమాటాలు – 2 ( పెద్దవి), సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – 2 రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి -5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు, క్యారెట్ ముక్కలు – అర కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
కొత్తిమీర రైస్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బాస్మతీ బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో నీళ్లు, ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి అన్నం గోరు వెచ్చగా అయిన తరువాత పొడి పొడిగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసి వేయించాలి. తరువాత కొత్తిమీరను పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇందులో టమాట ముక్కలు కూడా వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. వీటిని గోరు వెచ్చగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలను వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత పచ్చి బఠాణీని వేసి మెత్తగా అయ్యే వేయించాలి. తరువాత ఉప్పు, ధనియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయిచాలి.
ఇప్పుడు పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. చివరగా తరిగిన కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ తయారవుతుంది. దీనిని రైతా లేదా ఏదైనా గ్రేవీ కర్రీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొత్తిమీరతో రుచిగా రైస్ ను చేసుకుని తినవచ్చు. కొత్తిమీరతో ఈ వంటకాన్ని చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు కొత్తిమీరను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.