Corn Flour Halva Recipe : సాధారణంగా హల్వా అంటే చాలా మంది ఇష్టపడతారు. హల్వాను మనం రకరకాల పదార్థాలతో చేస్తుంటాం. క్యారెట్లు, గోధుమలు, గుమ్మడికాయలు, అరటి పండ్లు.. ఇలా అనేక రకాల పదార్థాలను ఉపయోగించి హల్వాను తయారు చేయవచ్చు. వీటి రుచులు కూడా వేరుగా ఉంటాయి. అయితే హల్వా తయారీకి కార్న్ ఫ్లోర్‌ను కూడా వాడవచ్చు. దీంతో చేసే హల్వా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ ఫ్లోర్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
కార్న్ ఫ్లోర్ – ఒక గ్లాస్, కాచి చల్లార్చిన పాలు – 3 గ్లాసులు, పంచదార – ఒక గ్లాస్, యాలకుల పొడి – అర టీ స్పూన్, వేయించిన జీడిపప్పు – కొద్దిగా.
కార్న్ ఫ్లోర్ హల్వా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. తరువాత దానిలో ఒక గ్లాస్ పాలను పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో పంచదార, పాలు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగి పాలు మరుగుతుండగా యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ను ఒకసారి కలిపి మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకోవాలి. దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
ఈ మిశ్రమం కళాయికి అంటుకోకుండా వేరవుతుండగా నెయ్యి రాసిన గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకుని పై భాగం అంతా సమమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత కావల్సిన పరిమాణంలో, కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వాటిపై జీడిపప్పును ఉంచి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లోర్ హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించేటప్పుడు కేవలం 5 నిమిషాల్లో అయ్యే ఈ కార్న్ ఫ్లోర్ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. కార్న్ ఫ్లోర్ తో చేసిన తీపి వంటకాన్ని కూడా అందరూ ఇష్టంగా తింటారు.