Crispy Chamagadda Vepudu : మనం చామదుంపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటితో వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. చామదుంపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేయడం చాలా సులభం. క్రిస్పీగా, రుచిగా అందరికి నచ్చేలా చామదుంపలతో వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చామగడ్డ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చామదుంపలు – పావు కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చామగడ్డ వేపుడు తయారీ విధానం..
ముందుగా చామదుంపలను కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చామదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చామదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఎండుకొబ్బరి పొడి వేసి వేయించాలి. తరువాత వేయించిన చామదుంప ముక్కలు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామగడ్డ వేపుడు తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పప్పు, సాంబార్ వంటి వాటితో తింటే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది.