Crispy Corn Samosa : సాయంత్రం స‌మ‌యంలో ఇలా క్రిస్పీగా కార్న్ స‌మోసా చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Crispy Corn Samosa : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బండ్ల మీద ల‌భించే స‌మోసా వెరైటీల‌ల్లో కార్న్ స‌మోసా కూడా ఒక‌టి. కార్న్ స‌మోసా చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట ల‌భించే ఈ స‌మోసా చాలా క్రిస్పీగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ కార్న్ స‌మోసాల‌ను అచ్చం అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు కార్న్ స‌మోసాను ఇంట్లోనే త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ కార్న్ స‌మోసాను ఇంట్లోనే ఏ విధంగా త‌యారు చేసుకోవాలి… వీటిని త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ కార్న్ స‌మోసా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదాపిండి – ఒకటిన్న‌ర క‌ప్పు, ఉప్పు – కొద్దిగా, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Crispy Corn Samosa recipe very tasty snacks
Crispy Corn Samosa

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, దంచిన ధ‌నియాలు – ఒక టీ స్పూన్, చిన్న‌గాత‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, స్వీట్ కార్న్ – ముప్పావు క‌ప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, దోర‌గా వేయించిన అటుకులు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

క్రిస్పీ కార్న్ స‌మోసా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, వేడి నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. దీనిని బాగా నొక్కుతూ క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌సాలా త‌యారీకి కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత స్వీట్ కార్న్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌ల‌పాలి. వీటిని మ‌రోరెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ వీలైనంత ప‌లుచ‌గా వ‌త్తుకోవాలి.

త‌రువాత వీటిని వేడి వేడి పెనం మీద వేసి రెండు వైపులా 5 సెక‌న్ల పాలు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని పొడ‌వుగా షీట్ లాగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో షీట్ ను తీసుకుని స‌మోసా ఆకారంలో మ‌డ‌వాలి. త‌రువాత ఇందులో కార్న్ మ‌సాలాను ఉంచి అంచుల‌కు మైదాపిండి పేస్ట్ ను రాసి స‌మోసా ఆకారంలో మ‌డుచుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక స‌మోసాల‌ను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ స‌మోసాలు త‌యార‌వుతాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts