Crispy Egg Bajji : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో ఎగ్ బజ్జీలు కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బండ్ల మీద లభించే ఈ ఎగ్ బజ్జీలను అదే రుచితో అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చిటికెలో వీటిని తయారు చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్లతో రుచికరమైన బజ్జీలను స్ట్రీట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – పావు టీ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు – 4, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఎగ్ బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన కోడిగుడ్లపై ఉండే పొట్టును తీసేసి వాటిని నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలను తీసుకుని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇలా తగినన్ని వేసుకున్న తరువాత మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బజ్జీ తయారవుతుంది. దీనిని టమాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్లతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇలా తయారు చేసినఎగ్ బజ్జీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.