Salt In Dishes : మనం వంటింట్లో అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. అవి రుచిగా ఉండడానికి అనేక రకాల పదార్థాలను వాటిలో వేస్తూ ఉంటాము. వంటల్లో వేసే వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. మనం చేసే వంటలకు చక్కటి రుచిని తీసుకు రావడంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉప్పు లేని కూరలను మనం ఊహించలేమనే చెప్పవచ్చు. అయితే కొన్ని సార్లు మనం చేసే కూరలల్లో ఉప్పు ఎక్కువవుతుంది. ఉప్పు ఎక్కువైన కూరలను తినలేము. అలా అని ఈ కూరలను పాడేయలేము. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తోచదు. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల కూరల రుచి పెరుగుతుందని కూడా చెప్పవచ్చు.
కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూరల్లో ఎక్కువైన ఉప్పును తగ్గించడంలో కొబ్బరిపాలు చక్కగా ఉపయోగపడతాయి. చిక్కటి కొబ్బరి పాలను కూరలో పోసి చిన్నమంటపై ఉడికించాలి.ఇలా చేయడం వల్ల కూరల్లో ఎక్కువైన ఉప్పు తగ్గుతుంది. అలాగే కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక ఉల్లిపాయను, ఒక టమాటాను పేస్ట్ గా చేసి కూరలో కలిపి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఉన్న ఉప్పు తగ్గడంతో పాటు కూర రుచి కూడా పెరుగుతుంది. అలాగే ఉడికించిన బంగాళాదుంపను ముక్కలుగా చేసి కూరల్లో వేయాలి.
ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఉన్న ఉప్పును బంగాళాదుంప ముక్కలు పీల్చుకుంటాయి. దీంతో కూరల్లో ఎక్కువగా ఉన్న ఉప్పు తగ్గుతుంది. ఇక గోధుమపిండిని తీసుకుని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో వేయాలి. ఉడికిన తరువాత ఈ ఉండలను తీసి వేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఉండే ఉప్పును గోధుమపిండి ఉండలు పీల్చుకుంటాయి. కూరల్లో ఉప్పు తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల కూరల్లో ఎక్కువైన ఉప్పును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.