Dhaba Style Hariyali Chicken : మనకు ధాబాలల్లో లభించే చికెన్ వెరైటీలల్లో హరియాలి చికెన్ కూడా ఒకటి. ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీతో తింటే ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. హరియాలి చికెన్ ను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ధాబా స్టైల్ హారియాలీ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ హరియాలి చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 5, యాలకులు – 3, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిలికిన పెరుగు – అర కప్పు, కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – ఒక కప్పు, పచ్చిమిర్చి – 4 లేదా 5, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్.
ధాబా స్టైల్ హరియాలి చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ లో ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నుండి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హరియాలీ చికెన్ తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం చికెన్ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.