Rice Idli : సాధారణంగా మనం రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నాన్ని తింటుంటాం. కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా అన్నాన్నే తింటుంటారు. అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అయ్యేలా అన్నాన్ని వండుతుంటారు. తక్కువ అయితే అన్నం మిగలదు. కానీ ఎక్కువ అయితే మాత్రం అన్నం మిగులుతుంది. దీంతో మిగిలిన అన్నాన్ని పడేస్తుంటారు. అలా చేయకుండా మిగిలిన అన్నంతోనూ మనం పలు రకాల వంటకాలను తయారు చేయవచ్చు. వాటిల్లో ఇడ్లీ ఒకటి. ఈ క్రమంలోనే మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – రెండు కప్పులు, ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, ఉప్పు – తగినంత.
అన్నం ఇడ్లీ తయారీ విధానం..
ఒక గంట ముందు ఇండ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో అన్నం వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి బాగా కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి మిశ్రమాన్ని వేసి ఇడ్లీ కుక్కర్‌లో ఉడికించుకోవాలి. దీంతో వేడి వేడి రైస్ ఇడ్లీ తయారవుతుంది. వీటిని టమాటా లేదా పల్లి చట్నీతో తింటే బాగుంటాయి. ఇలా మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. దీని వల్ల అన్నం వృథా కాకుండా ఉంటుంది.