Dondakaya Vepudu : మనం ఆహారంగా అనేక రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. కూరగాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ దొండకాయను తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలతో పచ్చడి, కూర, వేపుడు వంటి వాటిని తయారు చూస్తూ ఉంటాం. తరచూ చేసే దొండకాయ వేపుడుకు బదులుగా కరకరలాడుతూ ఉండే విధంగా కూడా మనం దొండకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. ఈ రకం వేపుడు మనకు ఎక్కువగా ఫంక్షన్ లలో, హోటల్స్ లో లభిస్తుంది. కరకరలాడేలా దొండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా తరిగిన దొండకాయలు – పావు కిలో, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నీళ్లు – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెబ్బలు.
దొండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని, కార్న్ ఫ్లోర్ ను, బియ్యం పిండిని, పసుపును, ఉప్పును, కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తరిగిన దొండకాయలను, నీళ్లను వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కొద్ది కొద్దిగా దొండకాయ ముక్కలను వేస్తూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్ని దొండకాయ ముక్కలనూ వేయించుకోవాలి.
తరువాత అదే నూనెలో పల్లీలను వేసి వేయించాలి. వీటిని కూడా దొండకాయ ముక్కలను ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసి కరకరలాడే వరకు వేయించి వీటిని కూడా అదే గిన్నెలో వేయాలి. ఇప్పుడు వీటిపై చిటికెడు ఉప్పు, కారాన్ని చల్లి అన్నీ కలిసేలా కలపాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడే దొండకాయ వేపుడు తయారవుతుంది. ఈ దొండకాయ వేపుడును నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తినవచ్చు. దొండకాయలతో తరచూ చేసే వంటకాలకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా వేపుడు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.