Drumstick Leaves Dosa : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో మునగకాయలు కూడా ఒకటి. మునగకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. కనుకనే వీటితో చాలా మంది చారు, కూరలు చేస్తుంటారు. మునగకాయలను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కేవలం మునగ కాయలు మాత్రమే కాదు.. మునగ ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల 300కు పైగా వ్యాధులు నయం అవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే మునగ ఆకులను నేరుగా తీసుకునేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ వాటితో ఎంతో రుచికరమైన దోశలను తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈ క్రమంలోనే మునగాకు దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు దోశల తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – 2 కప్పులు, నూనె – సరిపడా, శనగ పప్పు – అర కప్పు, బియ్యం – ఒకటిన్నర కప్పు, పచ్చి కొబ్బరి – 3 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – 8, చింత పండు రసం – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
మునగాకు దోశలను తయారు చేసే విధానం..
బియ్యం, పప్పు కలిపి 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీరు వడకట్టి చింత పండు రసం, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత మునగాకు కలిపి పెనంపై దోశల్లా వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ దోశలు వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. వీటిని మీకు ఇష్టమైన ఏదైనా చట్నీ లేదా రైతో తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. తరచూ చేసే రెగ్యులర్ దోశలకు బదులుగా ఇలా ఒక్కసారి మునగాకు దోశలను వేసుకుని తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అందరూ ఇష్టంగా తింటారు.