Chekkalu : పండుగ అనగానే ముందుగ మనకు గుర్తుకు వచ్చేవి పిండి వంటలు. పిండి వంటలు చేయనిదే అది పండుగలా అనిపించదు. మనం తయారు చేసే వివిధ రకాల పిండి వంటల్లో చెక్కలు కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. వీటిని తయారు చేసే విధానం మనలో చాలా మందికి తెలిసినప్పటికీ కొందరు ఎంత ప్రయత్నించినా వీటిని కరకరలాడుతూ ఉండేలా చేయలేకపోతుంటారు. రుచిగా ఉంటే గట్టిగా ఉంటాయి. కరకరలాడుతూ ఉంటే రుచిగా ఉండవు. ఈ చెక్కలను రుచిగా అలాగే కరకరలాడుతూ ఉండేలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – ఒక కిలో, నానబెట్టిన శనగ పప్పు – అర కప్పు, నానబెట్టిన పెసరపప్పు – అర కప్పు, ధనియాలు – పావుకప్పు, వెల్లుల్లి రెబ్బలు – 10, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 6, నువ్వులు – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – అర కప్పు, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చెక్కల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. తరువాత అందులో నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు, కారం, ఉప్పు, కరివేపాకు, బటర్, ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీటిని పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని మూతను లేదా తడి వస్త్రాన్ని వేసి పది నిమిషాల పాటు పక్కకు ఉంచాలి.
తరువాత చేతికి నూనెను రాసకుంటూ పిండిని తీసుకుని కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. తరువాత పూరీ మెషిన్ తీసుకుని దానిపై పాలిథీన్ కవర్ ను లేదా బటర్ పేపర్ ను ఉంచి దానికి నూనెను రాయాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుని కవర్ పై ఉంచి పలుచగా వత్తుకోవాలి. పూరీ మెషిన్ లేని వారు పాలిథీన్ కవర్ పై నూనెను రాసి పిండి ముద్దను తీసుకుని చేత్తో కూడా చెక్కలలా వత్తుకోవచ్చు. ఇలా కొన్నింటిని సిద్ధం చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తగినన్ని చెక్కలను వేసి కాల్చుకోవాలి.
వీటిని పెద్ద మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ రుచిగా ఉండే చెక్కలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటాయి. బయట లభించే చిరుతిళ్లను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి బదులుగా ఇలా ఇంట్లోనే చెక్కలను తయారు చేసుకుని స్నాక్స్ గా తీసుకోవచ్చు.