Egg 65 : రెస్టారెంట్లలో ల‌భించే ఎగ్ 65ని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Egg 65 : కోడిగుడ్డుతో కూర‌లే కాకుండా మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్లు కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్ల‌తో త‌యారు చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఎగ్ 65 ఒక‌టి. ఇది మ‌న‌కు పాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో, రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ 65 ని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా ఈ ఎగ్ 65 ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 4, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్, కోడిగుడ్డు తెల్ల‌సొన – కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్.

Egg 65 recipe in telugu make in this method
Egg 65

ఎగ్ 65 త‌యారీ విధానం..

ముందుగా కోడిగుడ్ల‌ల్లో ఉండే ప‌చ్చ‌సొనను తీసేసి వాటిని చిన్న ముక్క‌లుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో అల్లం పేస్ట్, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, కారం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత కోడిగుడ్డు తెల్ల‌సొన, నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని మంచూరియా ఆకారంలో నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం త‌రుగు, వెల్లుల్లి త‌రుగు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత రెడ్ చిల్లీ సాస్, స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన ఎగ్ ను వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 త‌యారవుతుంది. దీనిని ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే ఎగ్ 65 ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. కోడిగుడ్ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఎగ్ 65 ని కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ ఎగ్ 65 చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంకా కావాల‌ని అడిగి మ‌రీ దీనిని ఇష్టంగా తింటారు.

D

Recent Posts