Egg Bites : ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్లతో రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. కోడిగుడ్లతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోగలిగే చిరుతిళ్లల్లో ఎగ్ బైట్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. నిమిషాల వ్యవధిలోనే వీటిని తయారు చేసుకోవచ్చు.
సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఎగ్ బైట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 3, తురిమిన క్యారెట్ – 1, తురిమిన బంగాళాదుంప – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ బైట్స్ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరువాత ఇందులో ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత క్యారెట్ తురుము, బంగాళాదుంప తురుము వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల గిన్నెను ఉంచి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పొంగనాలుగా వేసుకోవాలి.
వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బైట్స్ తయారవుతాయి. వీటిటమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ఎగ్ బైట్స్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.