Endu Chepala Pulusu : మనం ఆహారంలో భాగంగా చేపలను కూడా తింటూ ఉంటాం. చేపలను తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా కలిగిన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో కూడా చేపలు సహాయపడతాయి.
వీటిని తరచూ తినడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. అయితే కేవలం పచ్చి చేపలనే కాకుండా ఎండు చేపలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూరనే కాకుండా పులుసును కూడా తయారు చేస్తుంటారు. ఎండు చేపలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. వీటితో పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు చేపలు – 100 గ్రా., చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), జీలకర్ర – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, మెంతుల పొడి – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నానబెట్టిన చింతపండు – 20 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎండు చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండు చేపలను వేసి 5 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేపల తలలను తీసేసి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరవాత జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు, ఒక కప్పు నీళ్లను పోసి కలపాలి. తరువాత ఎండు చేపలను వేసి మూత పెట్టి చేపలు ఉడికే వరకు ఉంచాలి. చేపలు ఉడికిన తరువాత కరివేపాకు, కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎండు చేపల పులుసు తయారవుతుంది. అన్నంతో కలిపి తింటే ఈ పులుసు చాలా రుచిగా ఉండడమే కాకుండా చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.