ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం బయపడకుండా దొంగతనాలు యదేచ్చగా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుండగా, ఇందులో దొంగలు ఓ ఫ్యామిలీపై చేసిన దాడి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో చూసిన వారు ఎవరు కూడా రాత్రి సమయంలో ప్రయాణాలు చేయరు. అంతగా భయపెట్టిస్తుంది ఈ వీడియో. వివరాలలోకి వెళితే రవి కర్నానీ అనే ఐటీ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నారు. అది అర్థరాత్రి సమయం కావడంతో కాస్త భయంతోనే వారు ప్రయాణిస్తున్నారు. లవాలే-నాందే రోడ్డులో కారులో వెళుతున్న సమయంలో వారికి భయానక ఘటన ఎదురైంది.
అల్లరి మూకలు సడెన్ గా రోడ్డుపై ప్రత్యక్షం అయి వారి కారుని ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆపకపోవడంతో అల్లరి మూకలు దాడి చేశాయి. కొందరు యువకులు బైకులు, కార్లతో వెంబడించారు. అంతేకాదు వారి చేతిలో కర్రలు, రాడ్లు ఉండడంతో వాటితో గట్టిగా కారుని కొడుతూ కారుని ఆపాలని వారు బెదిరించారు. ఐటీ ఉద్యోగి కారుని చాలాసేపు వెంబడించారు. దీంతో కారులో ఉన్న రవి, అతడి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే రవి మాత్రం కారుని ఆపకుండా అలానే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కారులో రవి కుటుంబ సభ్యులు ఎంత భయపడిపోయారో వీడియోలో మాటలు వింటే అర్ధం అవుతుంది.రవి.. వేగంగా పోనీ.. అంటూ అతడి భార్య ఏడుస్తూ, భయపడుతూ చెప్పిన మాటలు వీడియోలో వినొచ్చు. తమకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూడాలంటూ వారంతా దేవుడిని మొక్కుకున్నారు. అయితే రవి పోలీసులకి ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదట. అల్లరి మూకలు 40 మంది వరకు ఉన్నారని అందరి చేతుల్లో ఐరన్ రాడ్లు, కర్రలు, రాళ్లు ఉన్నాయి. బైక్, కారులో మా కారుని వారంతా వెంబడించారు. 80 కిలోమీటర్ల వేగంగా వారు మమ్మల్ని ఛేజ్ చేశారు. కానీ, నేను కారుని ఆపలేదు. చాలా భయమేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు” అని ఐటీ ఉద్యోగి రవి వాపోయారు. అయితే పోలీసులు చెబుతున్న వాదన ప్రకారం వారు స్థానిక గ్రామస్థులు అని, దొంగతనాలు ఎక్కువ కావడం వలన వారు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నారని, అయితే రవి కారు ఆపకపోవడంతో, వారు కారుని వెంబడించి దాడి చేశారని పోలీసులు వివరించారు.