Fish Curry Recipe : చేపలతో మనం వివిధ రకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చేపలతో చేసుకోదగిన వంటకాల్లో చేపల పులుసు కూడా ఒకటి. చేప పులుసు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది చేపల పులుసును ఇష్టంగా తింటారు. ఈ చేపల పులుసును రుచిగా, వంటరాని వారు కూడా చేసుకునేంత సలుభంగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేస ముక్కలు – 300 గ్రా., ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, మెంతులు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 6, తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), తరిగిన పచ్చిమిర్చి – 4, నూనె – అర కప్పు, కరివేపాకు – 2 రెబ్బలు, ఉప్పు – గినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన టమాట – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చింతపండు – 50 గ్రా., నీళ్లు – 500 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చింతపండులో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత కళాయిలో ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక ఇనుప కళాయిని తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలను వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత కారం, ధనియాల పోడి వేసి వేయించాలి. తరువాత నానబెట్టుకున్న చింతపండు నుండి చింతపండు రసంను తీసి వేసుకోవాలి. అలాగే నీటిని పోసి కలపాలి. పులుసు మరిగిన తరువాత శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసి ఉడికించాలి. వీటిని చిన్న మంటపై 5 నిమిషాల ఉడికించాలి. తరువాత పులుసులో గంటెను పెట్టకుండా కళాయిని పట్టుకుని ముక్కలను కదుపుకోవాలి. తరువాత ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
చేప ముక్కలు ఉడికిన తరువాత అందులో కొత్తిమీరను వేయాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని వేసి కళాయిని పట్టుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారవుతుంది. ఈ పులుసు తయారు చేసిన తరువాత రోజు తింటే మరింత రుచిగా ఉంటుంది. అలా వీలుపడని వారు చేపల పులుసు పూర్తిగా చల్లారిన తరువాతనైనా అన్నంతో కలిపి తినాలి.