Mysore Pak : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో మైసూర్ పాక్ ఒకటి. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనేయ తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే చాలా మంది దీనిని మనం ఇంట్లో తయారు చేసుకోలేం అని భావిస్తారు. కానీ బయట లభించే విధంగా రుచిగా, డొల్లగా ఉండే ఈ మైసూర్ పాక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ మైసూర్ పాక్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూర్ పాక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 100 గ్రా., పంచదార – 150 గ్రా., డాల్డా – ఒక కప్పు, నూనె – ఒక కప్పు.
మైసూర్ పాక్ తయారీ విధానం..
ముందుగా శనగపిండిని ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే ఒక కళాయిలో పంచదారను, ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. పంచదార కరిగి లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. పంచదార మిశ్రమం తయారవుతుండగానే మరో స్టవ్ మీద గిన్నెలో నూనె, డాల్డా వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి అలాగే ఉంచాలి. మరో స్టవ్ మీద పంచదార మిశ్రమం లేత తీగ పాకం వచ్చిన తరువాత అందులో జల్లెడ పట్టుకున్న శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిన తరువాత ఇందులో కాగుతున్న నూనెను గంటెతో కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాలకొకసారి నూనె అంతా అయిపోయేంత వరకు పోస్తూ కలుపుతూ ఉండాలి.
శనగపిండి మిశ్రమం నుండి నూనె వేరవుతున్నప్పుడు ఇది సిద్దమైనదిగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పైన అంతా గంటెతో సమానంగా చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చాకుతో కావల్సిన పరిమాణంలో గాట్లు పెట్టుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మైసూర్ పాక్ తయారవుతుంది. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే మైసూర్ పాక్ ను తయారు చేసుకుని తినవచ్చు.