Fish Curry : చేపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేపల్లో మన శరీరానికి మేలు చేసే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. చేపలతో చేసుకోదగిన వంటకాల్లో చేపల పులుసు ఒకటి. చక్కగా వండాలే కానీ చేపల పులుసును లొట్ట లేసుకుంటూ తింటారు. రుచిగా, సులభంగా ఈ చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – ఒక కిలో, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., నూనె – 5 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, కచ్చా పచ్చగా దంచిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మెంతి పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేపలను శుభ్రంగా కడగాలి. తరువాత ఈ చేప ముక్కలల్లో నిమ్మరసం, ఒక టీ స్పూన్ ఉప్పును వేయాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముక్కలను 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ ముక్కలను నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ పేస్ట్ ను వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత చేప ముక్కలను వేసి వేయించాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ బాగా వేయించిన తరువాత చింతపండు పులుసు వేసుకోవాలి.
తరువాత ఈ పులుసుకు తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత పులుసు పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. తరువాత మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి , ఉప్పు వేసి కలపాలి. దీనిని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించిన తరువాత గరం మసాలా పొడి వేసి కలపాలి. చివరికి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారవుతుంది. ఈ చేపల పులుసు పూర్తిగా చల్లారిన తరువాత అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన చేపల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.