Fish Fingers : ఫిష్ ఫింగర్స్.. చేపలతో చేసుకోదగిన స్నాక్స్ లో ఇవి కూడా ఒకటి. ఈ ఫింగర్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. చేపలను తినని వారు కూడా ఫిష్ ఫింగర్స్ ను ఇష్టంగా తింటారు. పార్టీ స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చేపలతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా ఫింగర్స్ ను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. చేపలతో రుచిగా, క్రిస్పీగా ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చేపలు – 300 గ్రా., ఉప్పు – తగినంత, నిమ్మరసం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, కోడిగుడ్డు- 1, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిల్లీ ఫ్లేక్స్ – పావు టీ స్పూన్, మస్టర్డ్ పేస్ట్ – అర టీ స్పూన్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా చేపలను ఫింగర్స్ ఆకారంలో పొడవుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. చేప ముక్కలను మ్యారినేట్ చేసుకున్న తరువాత అందులో నూనె, బ్రెడ్ క్రంబ్స్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకోవాలి. తరువాత చేప ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ తో కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై లైట్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.