Function Style Veg Pulao : మనం కూరగాయలతో వెజ్ పులావ్ ను తయారు చేస్తూ ఉంటాం. వెజ్ పులావ్ మనందరికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే దీనిని ఒక్కొక్కరు ఒక్కో రుచిలో తయారు చేస్తూ ఉంటారు. ఈ వెజ్ పులావ్ ను ఫంక్షన్స్ లో కూడా వడిస్తూ ఉంటారు. ఫంక్షన్స్ లో చేసే వెజ్ పులావ్ మరింత రుచిగా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఫంక్షన్స్ లో చేసే వెజ్ పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫంక్షన్స్ లో చేసినట్టు రుచిగా వెజ్ పులావ్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – అరకిలో, పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాటాలు – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా -ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కసూరి మెంతి -ఒక టీ స్పూన్, ఉప్పు -తగినంత,నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
మసాలా దినుసులు..
బిర్యానీ ఆకు – 1, యాలకులు – 5, లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సాజీరా – ఒక టీ స్పూన్, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1.
వెజ్ పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత కూరగాయ ముక్కలు, బఠాణీ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
తరువాత కసూరి మెంతి వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీటిని పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యాన్ని వేసి కలపాలి. దీనిని నీరంతా ఇగిరిపోయేంత వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మూత పెట్టి చిన్న మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ పులావ్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో రుచిగా తింటారు. రైతా లేదా మసాలా కూరలతో దీనిని కలిపి తింటే చాలారుచిగా ఉంటుంది.