Ganjatlu : గంజట్లు.. పాతకాలంలో ఎక్కువగా వీటిని తయారు చేసే వారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మినపప్పు, బియ్యంతో చేసే ఈ అట్లు సాధారణంగా చేసే అట్లకంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం అల్పాహారం కూడా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, దూదిలా మెత్తగా ఉండే ఈ గంజట్లను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు – ఒక గ్లాస్, బియ్యం – 8 గ్లాసులు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్.
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత జార్ లో నానబెట్టిన బియ్యాన్ని వేసి కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుండి ఒక గంటె పిండిని తీసుకుని మరో గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి కలుపుతూ వేడి చేయాలి. దీనిని దగ్గర పడే వరకు 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత జార్ లో మినపప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇందులోనే ఉడికించిన బియ్యం పిండి మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యంపిండిలో వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని రాత్రంతా పులియబెట్టాలి. పిండి చక్కగా పులిసిన తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత పిండిని తీసుకుని వేడి పెనం మీద అట్టు లాగా మందంగా వేసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. అట్టు ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గంజట్లు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు.