Garam Masala Powder : మనం చేసే వంటలు మరింత రుచిగా ఉండడానికి వంటల చివర్లో మనం గరం మసాలాను వేస్తూ ఉంటాం. గరం మసాలాను వేయడం వల్ల వంటల రుచి, వాసన మరింతగా పెరుగుతుంది. కేవలం మసాలా వంటకాల్లోనే కాకుండా ఇతర వంటకాల్లో కూడా మనం గరం మసాలాను వేస్తూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా అన్నీ వంటకాల్లోను దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. బయట మార్కెట్ లో మనకు వివిధ కంపెనీల గరం మసాలా ప్యాకెట్ లు లభిస్తూ ఉంటాయి. మనం వీటినే ఎక్కువగా వాడుతూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ గరం మసాలాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసే ఈ గరం మసాలా చక్కటి వాసనను కలిగి ఉండడంతో పాటు వంటలకు కూడా చక్కటి రుచిని కూడా తీసుకు వస్తుంది. ఇంట్లో చాలా సులభంగా గరం మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గరం మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – 35 గ్రా., నల్ల యాలకులు – 15 గ్రా., లవంగాలు – 5 గ్రా., మరాఠీ మొగ్గలు – 3, యాలకులు – 50 గ్రా., జాపత్రి – 5 గ్రా., మిరియాలు – 10 గ్రా., అనాస పువ్వులు – 5, పత్తర్ ఫూల్ – 5 గ్రా., సాజీరా – 5 గ్రా., జీలకర్ర – 5 గ్రా., ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 5, ఎండిన గులాబి రేకులు దేశవాలివి – 5 గ్రా., జాజికాయ – 5 గ్రా., తోక మిరియాలు – 10 గ్రా..
గరం మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో గులాబి రేకులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఈ మసాలా దినుసులన్నీ సగం వేగిన తరువాత గులాబి రేకులను వేసి కలపాలి. వీటన్నింటిని దోరగా వేయించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి వాసనను కలిగి ఉండే గరం మసాలా తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల ఆరు నెలలకు పైగా తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న గరం మసాలాను వంటల్లో కొద్దిగా వేస్తే వంటల రుచి, వాసన ఆమాంతం పెరుగుతాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే గరం మసాలాను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.