Gasagasala Karam Podi : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మసాలా వంటకాల్లో, తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. గసగసాలను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. గసగసాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, నిద్రలేమిని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు గసగసాలతో మనం ఎంతో రుచిగా ఉండే కారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. గసగసాలతో చేసే కారం రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. గసగసాలతో ఎంతో రుచిగా ఉండే కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గసగసాల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు – 100 గ్రా., ఎండుమిర్చి – 15, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6.
గసగసాల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో గసగసాలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై కలుపుతూ వేయించాలి. గసగసాలు చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత గససాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గసగసాల కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గసగసాలతో కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.