Godhumapindi Biscuits : పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే వాటిలో బిస్కెట్లు కూడా ఒకటి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే బిస్కెట్లను ఎక్కువగా మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. మైదాపిండి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కనుక ఈ బిస్కెట్లను గోధుమపిండితో తయారు చేసుకోవడం మంచిది. గోధుమపిండితో చేసే ఈ బిస్కెట్లు కూడా గుల్ల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. గోధుమపిండితో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, పంచదార పొడి – ఒక కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, శనగపిండి – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, రవ్వ – ఒక టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
గోధుమపిండి బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార పొడి వేసి స్పూన్ తో లేదా విస్కర్ తో 4 నుండి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో గోధుమపిండి, యాలకుల పొడి, శనగపిండి, వంటసోడా, ఉప్పు, రవ్వ వేసి కలపాలి. పిండి మరీ పలుచగా ఉంటే ఇందులో మరి కొద్దిగా గోధుమపిండి వేసికలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఫ్రీహీట్ చేసుకోవాలి. తరువాత అల్యూమినియం ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాసుకోవాలి. తరువాత పిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని గుండ్రంగా చేసుకోవాలి.
తరువాత దీనిని కొద్దిగా వత్తి మధ్యలో చిన్న రంధ్రం చేసి అందులో డ్రై ఫ్రూట్స్ ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్లను ప్లేట్ లోకి తీసుకుని ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మూత పెట్టి బేక్ చేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై 10 నుండి 13 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బిస్కెట్లను బయటకు తీసి చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా గోధుమపిండితో తయారు చేసిన బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.