Godhumapindi Bobbatlu : బొబ్బట్లు.. ఇవి తెలియని వారు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండగలకు మనం విరివిగా చేసే తీపి వంటకాల్లో ఇవి కూడా ఒకటి. బొబ్బట్లను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వీటిని మనం వివిధ రుచుల్లో కూడా తయారు చేస్తూ ఉంటాము. సాధారణంగా బొబ్బట్లను మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. అయితే నేటి తరుణంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్దతో మైదాపిండిని వాడడం మానేసారు. ఇలా మైదాపిండికి బదులుగా మనం గోధుమపిండితో కూడా రుచికరమైన బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో చేసే ఈ బొబ్బట్లు కూడా చాలా రుచిగా మెత్తగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. గోధుమపిండితో రుచికరమైన, మెత్తని బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
రెండు గంటల పాటు నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, గోధుమపిండి – 2 కప్పులు, పసుపు – చిటికెడు, ఉప్పు- చిటికెడు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
గోధుమపిండి బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పు వేసి నీళ్లు పోసుకోవాలి. తరువాత నెయ్యి వేసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి మెత్తగా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఉడికించిన పప్పును నీరంతా పోయేలా వడకట్టాలి. తరువాత ఈ పప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని కళాయిలో వేసుకోవాలి. తరువాత ఇందులో బెల్లం తురుము వేసి కలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగి ఈ మిశ్రమం ముద్దగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి.
తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమపిండిని తీసుకుని ముందుగా పూరీలాగా చేత్తో వత్తుకోవాలి. తరువాత ఇందులో శనగపప్పు మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ బొబ్బట్ల వలె పలుచగా వత్తుకోవాలి . తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నెయ్యి వేసి కాల్చుకుని సర్వ్ చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బొబ్బట్లు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బొబ్బట్లను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.