Goja Sweet : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో గోజా స్వీట్ కూడా ఒకటి. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అయితే సాధారణంగా ఈ స్వీట్ ను మైదాపిండి, పంచదారతో తయారు చేస్తారు. అయితే ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు కనుక వీటికి బదులుగా మనం గోధుమపిండి, బెల్లంతో కూడా ఈ స్వీట్ ను తయారు చేసుకోవచ్చు. రుచిగా, ఆరోగ్యానికి హాని కలగకుండా ఈ గోజా స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోజా స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – అర కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు, బెల్లం – 2 కప్పులు,నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోజా స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రవ్వను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో గోధుమపిండి, బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడకట్టి మరలా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని జిగురుగా అయ్యే వరకు ఉడికించి యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని తీసుకుని దీర్ఘచతురస్రాకారంలో ఇంచు మందం ఉండేలా వత్తుకోవాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇలా అన్నింటిని కట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక మంటను చిన్నగా చేసి కట్ చేసుకున్న ముక్కలను వేసి వేయించాలి. ఇవి నెమ్మదిగా పైకితేలిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించిన తరువాత నూనె నుండి తీసుకుని బెల్లం పాకంలో వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోజా స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు గోజా స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.