Grapes Lassi : వేసవి తాపానికి అందరూ అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల కారణంగా ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. అత్యవసరం అయితే తప్ప ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాలు అనేకం ఉన్నప్పటికీ వాటిల్లో లస్సీ ఎంతో ముఖ్యమైంది. పెరుగుతో తయారు చేసే ఈ లస్సీని తాగితే శరీరం మొత్తం చల్లబడుతుంది. వేడి తగ్గుతుంది. ఈ క్రమంలోనే ద్రాక్షలతో చల్ల చల్లని లస్సీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్ష లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర లీటర్, ద్రాక్ష పండ్లు (విత్తనాలు తీసినవి) – పావు కిలో, చక్కెర – పావు కప్పు, ఉప్పు – చిటికెడు.
ద్రాక్ష లస్సీని తయారు చేసే విధానం..
పెరుగు, ద్రాక్ష పండ్లు, చక్కెర, ఉప్పు అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసుకుని బ్లెండ్ చేయాలి. దీన్ని తయారు చేసిన తరువాత ఫ్రిజ్‌లో నిల్వ ఉంచరాదు. వెంటనే తాగేయాలి. అయితే ఇది చల్లగా ఉండేందుకు గాను అందులో కాస్త చల్లని నీరు కలుపుకుని తాగవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగవచ్చు. దీన్ని మధ్యాహ్నం సమయంలో తాగాలి. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు.