Instant Idli Premix : మనం అల్పాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇడ్లీలను ఇష్టంగా తినప్పటికి వీటిని తయారు చేయడం కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే చెప్పవచ్చు. ముందురోజే పప్పును నానబెట్టి రుబ్బి పిండిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి శ్రమ లేకుండా ఇన్ స్టాంట్ గా ఎంతో మెత్తని రుచికరమైన ఇడ్లీలను మనం తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పొడిని తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు మనం చాలా సులభంగా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీనితో మెత్తని ఇడ్లీలను ఎలా చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 3 కప్పులు, మినపగుళ్లు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – ఒక కప్పు, పుల్లటి పెరుగు – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, ఈనో పౌడర్ – అర టీ స్పూన్.
ఇడ్లీ పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో బియ్యం వేసి వేయించాలి. వీటిని అటూ ఇటూ కదుపుతూ 3 నిమిషాల పాటు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మినపగుళ్లు, మెంతులు వేసి వేయించాలి. వీటిని కూడా కదుపుతూ 2 నిమిషాల పాటు వేయించిన తరువాత అటుకులు వేసి వేయించాలి. ఈ అటుకులను మరో రెండు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లారిన తరువాత ముందుగా అటుకులు, మినపగుళ్లను జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో కొద్ది కొద్దిగా బియ్యాన్నివేస్తూ సన్నని రవ్వ మాదిరి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ మిశ్రమమంవతా చల్లారిన తరువాత డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి. బయట ఉంచడం వల్ల ఈ మిక్స్ 3 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇడ్లీ పొడి తయారవుతుంది. ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని కూడా దీనిని నిల్వ చేసుకోవచ్చు.ఈ పొడితో ఇన్ స్టాంట్ గా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు ఇడ్లీ ప్రీ మిక్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పిండి చక్కగా నానిన తరువాత ఇందులో ఈనో పౌడర్ ను వేసుకోవాలి.
తరువాత పౌడర్ మీద తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరి చక్కగా కలుపుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత ఇడ్లీ ప్లేట్ లలో పిండిని వేసుకుని కుక్కర్ లో ఉంచాలి. ఈ ఇడ్లీలను మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇడ్లీలు కొద్దిగాచల్లారిన తరువాత ప్లేట్ ల నుండి తీసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా మెత్తగా ఇడ్లీలు తయారవుతాయి. ఏ చట్నీతో తిన్నా కూడా ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి.